2 సమూయేలు  
 1
సౌలు మరణం గురించి దావీదు వినటం 
 1 దావీదు అమాలేకీయులను ఓడించిన తర్వాత అతను సిక్లగుకు వచ్చి రెండు రోజులపాటు ఉన్నాడు. ఇది సౌలు మరణించిన తరువాత జరిగింది.  2 మూడవ రోజున సిక్లగుకు ఒక యువసైనికుడు వచ్చాడు. ఇతడు సౌలు శిబిరము నుండి వచ్చాడు. వాని బట్టలు చిరిగిపోయి వున్నాయి. తలనిండా మట్టి పడివుంది అతను దావీదు వద్దకు వచ్చి ప్రణమిల్లాడు. 
 3 “నీవు ఎక్కడ నుండి వచ్చావు?” అని దావీదు వానిని అడిగాడు. 
“నేను ఇశ్రాయేలీయుల శిబిరము నుండి తప్పించు కొని వచ్చాను” అని దావీదుకు సమాధాన మిచ్చాడు. 
 4 “దయచేసి యుద్ధంలో ఎవరు గెల్చారో చెప్పు” అని దావీదు అడిగాడు. 
“జనం యుద్ధభూమి నుండి పారిపోయారు. అనేక మంది హతులయ్యారు. సౌలు, ఆయన కుమారుడు యోనాతాను ఇద్దరూ చనిపోయారు” అని చెప్పాడా వ్యక్తి. 
 5 దావీదు, “సౌలు, ఆయన కుమారుడు యోనాతాను ఇద్దరూ చనిపోయినట్లు నీకు ఎలా తెలుసు?” అని అడిగాడు. 
 6 అందుకు యువసైనికుడు, ఇలా చెప్పెను: “నేను ఆ సమయంలో గిల్బోవ పర్వతం మీదకు రావటం జరిగింది. సౌలు తన ఈటెపై ఆనుకొని వుండటం నేను చూశాను. ఫిలిష్తీయులు తమ రథాల మీద, గుర్రాల మీద సౌలుకు చేరువగా వస్తూవున్నారు.  7 సౌలు వెనుదిరిగి నన్ను చూశాడు. ఆయన నన్ను పిలవగా నన్నేమి చేయమంటారు? అంటూ వెళ్లాను.  8 ‘నీవెవడవు’ అని సౌలు నన్నడిగాడు. నేనొక అమాలేకీయుడనని చెప్పాను.  9 సౌలు నాతో, ‘దయచేసి కొంచెం ఆగి నన్ను చంపివేయుము. నేను తీవ్రంగా గాయపడ్డాను. నేను ఇంచుమించు చనిపోయినట్లే’ అని చెప్పాడు.  10 అందువల్ల నేను ఆగి, ఆయనను చంపాను. ఆయన ఇక బ్రతకనంత తీవ్రంగా గాయపడ్డాడని నాకు తెలుసు. అప్పుడు నేనాయన కిరీటాన్ని, కంకణాన్ని తీసుకొని, వాటిని నా యజమానివైన నీ యొద్దకు తెచ్చాను.” 
 11 తన దుఃఖాన్ని వెలిబుచ్చటానికి దావీదు తన బట్టలను చించుకున్నాడు. దావీదుతో వున్న మనుష్యులందరూ అలానే చేశారు.  12 వారు మిక్కిలి దుఃఖించారు. సాయంత్రం వరకు వారేమీ తినలేదు. సౌలు, అతని కుమారుడు యోనాతాను ఇరువురూ మరణించినందుకు వారు విలపించారు. మరణించిన యెహోవా ప్రజలకొరకు, ఇశ్రాయేలు కొరకు దావీదు, అతని మనుష్యులు దుఃఖించారు. సౌలు, అతని కుమారుడు యోనాతాను, తదితర ఇశ్రాయేలీయులు కత్తులతో నరకబడి చంపబడినందుకు వారు విలపించారు. 
అమాలేకీయుని చంపమని దావీదు ఆజ్ఞ 
 13 సౌలు మరణవార్త తెచ్చిన ఆ యువసైనికుని, “నీవెక్కడ నుంచి వచ్చావు?” అని దావీదు అడిగాడు. 
“నేనొక పరదేశీయుని కుమారుడను. అమాలేకీయుడను,” అని ఆ యువసైనికుడు అన్నాడు. 
 14 “యెహోవాచే ప్రతిష్ఠింపబడిన రాజును చంపటానికి నీవెందుకు భయపడలేదు?” అని దావీదు వానిని అడిగాడు. 
 15-16 తరువాత దావీదు తన యువభటులలో ఒకనిని పిలిచి ఆ అమాలేకీయుని చంపుమని చెప్పాడు. యువకుడైన ఇశ్రాయేలు సైనికుడు అమాలేకీయుని చంపివేశాడు. “నీ చావుకు నీవే కారకుడవు. నీకు వ్యతిరేకంగా నీవే మాట్లాడావు!* నీ చావుకు … మాట్లాడావు నీ రక్తం నీ తలమీదే పడుగాక అని శబ్దార్థం. ‘దేవునిచే ఎంపిక చేయబడిన రాజును నేనే చంపానని’ నీవే అన్నావు,” అని దావీదు ఆ అమాలేకీయునుద్దేశించి అన్నాడు. 
సౌలు, యోనాతానులను గూర్చిన దావీదు ప్రలాప గీతిక 
 17 సౌలు, అతని కుమారుడు యోనాతానులను గూర్చి దావీదు ఒక ప్రలాప గీతం పాడాడు.  18 యూదా ప్రజలకు ఈ పాట నేర్పుమని దావీదు తన మనుష్యులకు చెప్పాడు. ఈ పాట “ధనుర్గీతిక” అని పిలవబడింది: ఈ పాటయాషారు గ్రంధంలో ఇలా వ్రాయబడి వుంది. 
 19 ఓహో! “ఇశ్రాయేలూ నీ సౌందర్యం ఉన్నత స్థలాలపై ధ్వంసం చేయబడింది! 
బలాఢ్యులు పడిపోయారు! 
 20 ఈ విషయం గాతులో చెప్పవద్దు, 
అష్కెలోను† అష్కెలోను ఇది ఫిలిష్తీయుల ఐదు నగరాలలో ఒకటి. వీధులలో ప్రకటించ వద్దు! 
ఏలయనగా ఫిలిష్తీయుల ఆడపడుచులు సంతసించ వచ్చు, 
సున్నతి కాని వారి కుమార్తెలు ఉల్లసించవచ్చు! 
 21 “గిల్బోవ పర్వతాలపై హిమబిందువులు గాని 
వాన చినుకులు గాని పడకుండుగాక! 
ఆ పొలాలు బీడులైపోవుగాక! 
యోధులైన వారి డాళ్లు అక్కడ మలినమైనాయి 
అభిషిక్తుడైన సౌలు డాలు నూనెతో మెరుగు పెట్టబడలేదు. 
 22 యోనాతాను విల్లు దానివంతు శత్రు సంహారంచేసింది. 
సౌలు కత్తి దానివంతు శత్రువులను తుత్తునియలు చేసింది 
అవి శత్రురక్తాన్ని చిందించాయి యోధుల, 
కొవ్వును స్పృశించాయి. 
 23 “సౌలును, యోనాతానును మేము ప్రేమించాము; 
వారు బ్రతికి వుండగా వారి సహాయ సంపత్తును అనుభవించాము! 
మరణంలో సైతం సౌలు, యోనాతాను ఎడబాటు ఎరుగరు! 
వారు పక్షి రాజుల కంటె వేగం గలవారు, 
వారు సింహాల కంటె బలంగలవారు! 
 24 ఇశ్రాయేలు కుమార్తెలారా, సౌలు కొరకు ఏడ్వండి! 
సౌలు మిమ్మల్ని ఎర్రని ఛాయగల దుస్తులతో అలంకరించియున్నాడు; 
మీ దుస్తులపై బంగారు నగలు పెట్టాడు. 
 25 “యుద్ధంలో బలవంతులు నేలకొరిగారు! 
యోనాతాను గిల్భోవ కొండల్లో కన్ను మూశాడు. 
 26 యోనాతానూ, సహోదరుడా! నీ కొరకై విలపిస్తున్నాను. 
నీ స్నేహపు మాధుర్యాన్ని చవిచూశాను; 
నా పట్ల నీ ప్రేమ అద్భతం, 
అది స్త్రీల ప్రేమకంటే మహోన్నతమైనది! 
 27 శక్తిమంతులు యుద్ధ రంగంలో నేలకొరిగారు! 
వారి ఆయుధాలు నాశనమయ్యాయి.”