5
 1 (యువతి ప్రియుడు ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు). 
నా సోదరీ, చెలీ, నేను నా తోటలోకి వచ్చాను. నా జటామాంసిని నా సుగంధాలతో తెచ్చుకున్నాను. 
తేనె, తేనెపట్టుతో తిన్నాను. నా ద్రాక్షారసాన్ని నా పాలతో తాగాను. 
నేస్తమా, తిను. నేస్తం, తిను. ప్రియా, బాగా తాగు. 
విరహ వేదన 
 2 [నాలుగవ భాగం] (యువతి మాట్లాడుతూ ఉంది) 
నేను నిద్ర పోయాను గానీ నా మనస్సు కల కంటోంది. 
నా ప్రియుడు తలుపు తడుతూ పిలుస్తున్న శబ్దం “నా సోదరీ, ప్రియతమా, నా పావురమా, నిష్కళంకితా, తలుపు తియ్యి. 
నా తల మంచుకు తడిసింది. నా జుట్టు రాత్రి మంచుకు తడిసింది.” 
 3 (యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది.) 
నేను బట్టలు తీసేశాను. మళ్ళీ వాటిని వేసుకోవాలా? 
కాళ్ళు కడుక్కున్నాను. మళ్ళీ మురికి చేసుకోవాలా? 
 4 తలుపు సందులో నా ప్రియుడు చెయ్యి పెట్టగానే నా గుండె అతని కోసం కొట్టుకుంది. 
 5 నా ప్రియుడి కోసం తలుపు తీయడానికి నేను లేచాను. 
నా చేతుల నుంచి బోళం కారుతూ ఉంది. నా వేళ్ళకున్న బోళం తడి తలుపు గడియపై కారింది. 
 6 నా ప్రియునికి తలుపు తీశాను. కానీ అతడు వెళ్లిపోయాడు. నేను కుంగిపోయాను. నీరుగారిపోయాను. 
నేనతని కోసం వెతికినా కనబడలేదు. నేనతన్ని పిలిచినా అతడు పలకలేదు. 
 7 పట్టణంలో గస్తీ తిరిగేవారు నాకు ఎదురుపడ్డారు. 
వాళ్ళు నన్ను కొట్టి గాయపర్చారు. 
ప్రాకారం మీద ఉన్న కావలివారు నా పైట చెంగు లాగేసుకున్నారు. 
 8 (యువతి పట్టణ స్త్రీలతో మాట్లాడుతూ ఉంది) 
యెరూషలేము ఆడపడుచులారా, నా ప్రియుడు మీకు కనిపిస్తే, అతనిపట్ల ప్రేమతో నేను సొమ్మసిల్లి పోతున్నానని అతనికి చెప్పమని మిమ్మల్ని బతిమాలుతున్నాను. 
 9 (పట్టణ స్త్రీలు యువతితో మాట్లాడుతూ ఉన్నారు.) 
జగదేక సుందరీ, వేరే ప్రియుల కంటే నీ ప్రియుడి విశేషమేంటి? 
నువ్వు మాచేత ఇలా ప్రమాణం చేయించుకోడానికి వేరే ప్రియుల కంటే నీ ప్రియుడు ఏవిధంగా గొప్ప? 
 10 (యువతి పట్టణ స్త్రీలతో మాట్లాడుతూ ఉంది) 
నా ప్రియుడు చూడ చక్కని వాడు. ఎర్రని వాడు. పదివేలమందిలో ప్రత్యేకమైన వాడు. 
 11 అతని తల మేలిమి బంగారం. అతనిది ఉంగరాల జుట్టు, కాకి నలుపు. 
 12 అతని కళ్ళు నదీతీరాన ఎగిరే గువ్వల్లాంటివి. అవి పాలతో కడిగి, రత్నాలు పొదిగినట్టుగా ఉన్నాయి. 
 13 అతని చెక్కిళ్ళు సుగంధమొక్కల తోటలా, కమ్మని సువాసన ఇస్తున్నాయి. అతని పెదవులు లిల్లీ పువ్వుల్లా, బోళం ఊరుతున్నట్టుగా ఉన్నాయి. 
 14 అతని చేతులు, రత్నాలు పొదిగిన బంగారు కడ్డీలు. అతని ఉదరం పచ్చలు పొదిగిన ఏనుగు దంతం. 
 15 అతని కాళ్లు పాలరాతి స్తంభాల్లా ఉన్నాయి. అవి అచ్చమైన బంగారు కుదురు మీద నిలిపినట్టున్నాయి. 
అతని ఆకారం లెబానోను పర్వతాల్లా, దేవదారు వృక్షాల్లా రమ్యం. 
 16 అతని నోరు అత్యంత మధురం. అతడు మూర్తీభవించిన పరిపూర్ణ సౌందర్యం. 
యెరూషలేము ఆడపడుచులారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా నెచ్చెలి.